దుర్గమ్మను దర్శించుకున్న ఎస్సీ ఎస్టీ కమిటీ చైర్మన్ బక్కి వెంకటయ్య, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): ఏడుపాయల జాతరలో ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు శనివారం సాయంత్రం కన్నుల పండువగా సాగింది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు ఏడుపాయల ఆలయ ఈవో మోహన్ రెడ్డి, చైర్మన్ బాల గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసి బండ్ల ఊరేగింపును ప్రారంభించారు. జాతర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పొద్దంతా బోనాల సందడి, డప్పుల మోతలు, శివసత్తుల సిగాలు, పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల ప్రాంగణం పండుగ వాతావరణం కనిపించింది. డప్పుల దరువులు… హుషారుగా యువకుల నృత్యాలు… జై బోలో దుర్గా భవానీ మాతాకీ అంటూ భక్తుల నినాదాలు మధ్య కనుల పండుగగా జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.