ఏడుపాయల్లో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేశాం : మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించిన కలెక్టర్, ఎమ్మెల్యే దంపతులు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. శుక్రవారం ఏడుపాయల జాతర వనదుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరుపన పట్టు వస్త్రాలను
కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ దంపతులు సమర్పించారు.
వేద పండితులు పూర్ణకుంభంతో వారికి వేద పండితులు, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కల్పించి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ మీడియాతో మాట్లాడుతూ కనీవిని ఎరుగని రీతిలో జాతర ఏర్పాట్లు చేశామన్నార్రు. జాతర బ్రహ్మాండంగా జరగాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగిందని అన్నారు. అంగరంగ వైభవంగా భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఏడుపాయలను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటూ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతర విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మెదక్ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఏడుపాయల జాతరను ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశామన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ జాతరలో తొలిరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభమైన ఈ జాతర కోసం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక చింతనతో భక్తుల తాకిడి క్రమేపీ పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమాదేవి, ఆలయ చైర్మన్ బాలగౌడ్,
ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
అమ్మవారిని దర్శించుకున్న మైనంపల్లి హనుమంతరావు
ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో పాలకమండలి సభ్యులు,
అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు.
పోటెత్తిన భక్తజనం
ఏడుపాయల వనదుర్గ భవాని మాత అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయం వద్దకు వచ్చిన భక్తులు వన దుర్గాభవాని అమ్మవారికి పాలు, పూలు, ఫలహారాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి ఆలయం దగ్గర జాగారం చేసేందుకు లక్షలాది మంది భక్తులు రానుoడడంతో పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
