తీవ్ర ఉల్లంఘనలు ఉన్న పరిశ్రమలను మూసి వేయించాలి
లేబర్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
టీఎస్ఐఐసి ఆధ్వర్యంలో రెస్క్యు కమిటీ ఏర్పాటు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ రూపేష్ తో కలిసి పటాన్చెరు మండలం పాశం మైలారం ఐలా భవనంలో ఐలా ప్రతినిధులు, టీఎస్ఐఐసి, పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అగ్నిమాపక ,కార్మిక, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంగళవారం రాత్రి సాలిబరీస్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ప్రమాదం జరిగినపుడు ఐలా తరఫున ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఆయా శాఖల అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? ఆయా విషయాలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కంపెనీలను మూసి వేయాలన్నారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అన్ని కంపెనీలను తనిఖీ చేసి, పూర్తి నివేదికను అందజేయాలన్నారు. కార్మికులకు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేలా లేబర్ గ్రీవెన్స్ మెకానిజం ఏర్పాటు చేయాలని, వాటిని కార్మిక, టిఎస్ఐఐసి అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
జడ్ఎం టిఐఐసి ఆధ్వర్యంలో ఐలా, అనుబంధ శాఖల అధికారులతో రెస్క్యు కమిటీ ఏర్పాటుచేసి, ఎవరెవరు ఏం చేయాలన్న విధులను పేర్కొనాలని సూచించారు. సంబంధిత కమిటీ అన్ని పరిశ్రమలను తనిఖీ చేసి ఫైర్ సేఫ్టీ తదితర నిబంధనలు పాటిస్తున్నాయా లేదా పరిశీలించాలనీ, నిబంధనల ఉల్లంఘిస్తున్న పరిశ్రమలను మూసివేయాలన్నారు.
పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలను, ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారు, భవన సెట్ బ్యాక్, కార్మిక సంక్షేమంకు తీసుకుంటున్న వివరాలు, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన కంపెనీ యజమాని, అధికారుల వివరాలు, ఫోన్ నెంబర్లను కంపెనీ ముందు, ఆఫీస్ గోడపై డిస్ప్లే చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాపర్టీ టాక్స్ కట్టని కంపెనీలను మూసి వేయించాలని, ట్యాక్స్ కట్టిన తర్వాతే ఓపెన్ చేయాలని టిఎస్ ఐఐసి అధికారులకు సూచించారు. కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్న పరిశ్రమల యజమానులపై కేసులు నమోదు చేయాలన్నారు. లైసెన్స్లు అన్నింటిని చెక్ చేయాలని సూచించారు.
ఫైర్ సేఫ్టీ నిబంధనలపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారికి సూచించారు. అంతకుముందు కలెక్టర్, ఎస్పీ ఆయా అధికారుల బృందం మంగళవారం రాత్రి ప్రమాదం జరిగిన సాలిబరీస్ పరిశ్రమను పరిశీలించారు. వైటాల్, వెంకల్ కెమికల్ ఫ్యాక్టరీ, అరబిందో పరిశ్రమలను తనిఖీ చేశారు. అరబిందో పరిశ్రమలో ఫైర్ సేఫ్టీ నిబంధనలకు సంబంధించి సర్ ప్రైజ్ మాక్ డ్రిల్ చేయించి పరిశీలించారు. నిబంధనల ఉల్లంఘనలు గమనించిన పరిశ్రమలపై తక్షణమే పీసీబి, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించారు. పరిశ్రమ కాలుష్యం చెరువులోకి వదులుతున్న సంబంధిత కంపెనీపై చర్యలు తీసుకోవాలని పిసిబి అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రూపేష్, రెవెన్యూ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం ప్రశాంత్, ఆయా అనుబంధ శాఖల అధికారులు, ఐలా ప్రతినిధులు, పటాన్చెరు డీఎస్పీ పాల్గొన్నారు.
.