బిఆర్ఎస్ అప్పులు చేస్తే.. కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది

అవినీతి రహిత పాలన కాంగ్రెస్ లక్ష్యం

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): గత బిఆర్ఎస్  ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తుందని ఆయన అన్నారు. సోమవారం మెదక్ ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ మొదటిసారిగా చిన్నశంకరంపేట మండల పరిషత్ కార్యాలయం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మైనంపల్లి రోహిత్ ను అధికారులు ఘన స్వాగతం పలుకుతూ శాలువాలతో పుష్పగుచ్చాలు అందించి సన్మానించారు. అనంతరం ఆయన అభివృద్ధిపై అధికారులతో మాట్లాడారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.

ప్రతి ఒక్క ఉద్యోగి తనకు సహాయ సహకారాలు అందిస్తే అభివృద్ధి మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ప్రజల దృష్టిలో పెట్టుకొని నేను అందుబాటులో ఉంటానని రాత్రి పగలు ఎప్పుడైనా మీ సమస్యలు పట్ల మీకు అందుబాటులో ఉండి సమస్యలపై దృష్టి పెట్టి పనులు చేయిస్తానన్నారు. మాటలతో కాదు చేతులతో చేసి చూపిస్తానని ప్రజా సమస్యలపై తాను ఎంతవరకైనా పోరాడతానని తెలిపారు. స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ చిన్నశంకరం పేట మండలంలో సుమారు చాలా రోజుల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని వీటి స్థానంలో సమీకృత భవన నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే రోహిత్కు సమీక్ష సమావేశంలో సూచించారు.

మండల కేంద్రంలోని పంచాయతీ భవనం శిథిలా వ్యవస్థకు చేరుకుందని వెంటనే పంచాయతీ భవనానికి నిధులు మంజూరు చేసి భవన నిర్మాణం చేపట్టాలని ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి అన్నారు. ఎలక్షన్ ముందు వివిధ భవనాలకు ప్రొసీడింగ్  కాపీలు గత ప్రభుత్వం ఇచ్చిందని, వీటికి నిధులు ఉన్నాయని సర్పంచ్ రాజిరెడ్డిని అడగగా, స్పందించిన పిఆర్ ఏఈ, ప్రొసీడింగ్ కాపీలను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి,  తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, మండల విద్యాధికారి బుచ్చయ్య నాయక్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ నిఖిల, పద్మ, సిపిడిఓ స్వరూపా, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

.