
కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయం
ఓడిన అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి
పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యం
పదవుల పంపకానికి చెక్ తప్పదా?
ఓడిన నేతల ఆశలకు నీళ్లు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పిసిసి, ఏఐసీసీ దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు స్థానాల్లో ఉన్న ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ లపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు రూపకల్పన రచిస్తున్నట్లు స్పష్టమవుతుంది.
అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టులు ఇవ్వొద్దని పీసీసీ, ఏఐసీసీ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వారికి పదవులు అప్పగించడం కంటే సెగ్మెంట్లలో పార్టీ బలోపేతానికి పాటుపడేలా చేయాలన్నది అధిష్టానం భావిస్తున్నది. దీంతో ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వారికే టికెట్లు ఇస్తామని, గెలిచేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించేలా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు కేవలం మెదక్, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మిగతా ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఓడిన సెగ్మెంట్లలో అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో నియోజకవర్గానికి అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెప్పించి నిత్యం ప్రజల మధ్య ఉండేలా పార్టీ వారికి టాస్క్ అప్పగించనుంది. ఇందుకోసం ఆ జిల్లా మంత్రులు సైతం ఇలాంటి సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నాయకత్వం సూచనప్రాయంగా తెలిపింది.
నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వం కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నది. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించలేక పోయామనే చర్చ ప్రజల్లో జరిగేలా నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చదిద్దడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నాయకత్వం సూచిస్తున్నది. ఆ నియోజకవర్గ పరిధిలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడేలా ఆలోచిస్తున్నది.
పదవుల పంపకానికి చెక్..?
అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓడిపోయిన కొందరికి మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఎమ్మెల్సీ చేసే ఆలోచన ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొద్ది మందికి ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టు వస్తుందనే ఆశలూ ఉన్నాయి. వాటి కోసం ప్రయత్నాలను కూడా మొదలుపెట్టారు. అధికారంలో ఉన్నందున ఇలాంటి పోస్టులు ఇవ్వడానికి చిక్కులేమీ లేకపోయినప్పటికీ ఓడినవారు ఆయా నియోజకవర్గాల్లో ప్రజల తలలో నాలుకలా మారేలా, యాక్టివిటీస్ ను ముమ్మరం చేసి పార్టీని బలోపేతం చేయడం ఉత్తమం అని నాయకత్వం భావిస్తున్నది. తప్పనిసరి పోస్టులను మాత్రమే సమర్థులైన వారితో భర్తీ చేయాలని భావిస్తున్నది. అందులో భాగంగానే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన ప్రకటన ఇందుకు బలం చేకూరుస్తుంది. తాను పదవులను ఆశించడం లేదని, ప్రజలు తనకు ఐదేళ్లు రెస్ట్ ఇచ్చారని.. ఈ సమయాన్ని అన్ని జిల్లాలలో పార్టీ బలోపేతం కోసం వినియోగిస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యం..
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేసేలా నిర్ణయాత్మక వ్యూహాలను అవలంబిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పటిష్టత కోసం ప్రజల్లో తిరిగేలా నిర్ణయాన్ని పిసిసి, ఏఐసీసీ నేతలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
