రౌడీ మేళా కార్యక్రమంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కటువుగా వ్యవహరిస్తాం.. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్ లకు శుక్రవారం జిల్లా పోలీసు కళ్యాణ మండపం నందు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. పుట్టుకతో ఎవరు కూడా నేరస్తులు కారని, వారు పెరిగిన పరిసరాలు, పరిస్థితుల ప్రభావాల వలన సస్పెక్ట్, కేడిలు, రౌడీ షీటర్ లుగా మారి ఉండవచ్చు, కానీ మీ ప్రవవర్తన మంచిగా ఉన్నట్లయితే తిరిగి మామూలు వ్యక్తులుగా మరే అవకాశం మీచేతుల్లోనే ఉందని అన్నారు. చట్టానికి ఎవ్వరూ అతీతులు కారని, చట్టాన్ని గౌరవించే వారితోనే ఫ్రెండ్లీగా ఉంటామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కటువుగా వ్యవహరించడం జరుగుతుందని, జిల్లా ప్రజలెవరైనా సంఘవిద్రోహ చర్యలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని, అలాంటి వ్యక్తులు ఎవరైన ఉన్నట్లయితే వారిపై హిస్టరీ షీట్ లు ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. రౌడీ షీటర్లతో ఒకొక్కరితో మాట్లాడుతూ ప్రస్తుతం ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు అని, ఎక్కడ నివాసిస్తున్నారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి గొడవలలో తల దూర్చకుండా సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లైతే మీపై ఉన్న హిస్టరీ షీట్లను తొలిగించడం జరుగుతుందని, అనవసర గొడవలకు పోయి ఇబ్బందులకు గురి కాకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డా.పి.అశోక్, రమేష్ కుమార్ డిఎస్పీ సంగారెడ్డి, రఘు డియస్పి జహీరాబాద్, వెంకట్ రెడ్డి డియస్పి నారాయణఖేడ్, శివలింగం ఇన్స్పెక్టర్ యస్.బి., జిల్లా సి.ఐ.లు, ఎస్.ఐ. లు తదితరులు పాల్గొన్నారు.