
ఓట్లు రాబట్టినా..సీట్లు రాలే
రెండు చోట్ల డిపాజిట్లు గల్లంతు
దుబ్బాక, గజ్వేల్ మినహా మూడో స్థానానికి పరిమితం
మెదక్ లో సహకరించని స్థానిక నాయకత్వం
రాబోయే ఎంపీ ఎన్నికలకు ప్రక్షాళన తప్పదా?
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ఉమ్మడి మెదక్ జిల్లాలో కమలం పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది.. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుండి ఒక్క సీటు కూడా పొందలేకపోవడంపై బిజెపి అధిష్టానం అంతర్గత సమీక్షలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏకైక బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం ఓడిపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2023లో ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క సీటు కూడా పొందలేకపోయింది. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు బిజెపి అభ్యర్థులు పోటీ చేయగా దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో మాత్రమే రెండవ స్థానాన్ని పొందగలిగారు. మిగతా ఎనిమిది స్థానాల్లో బిజెపి మూడవ స్థానానికి పరిమితమైంది. ఇందులో ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో డిపాజిట్ సైతం కోల్పోయింది.
గత రెండు మూడేళ్లుగా సర్కార్ పై రాష్ట్రవ్యాప్తంగా హోరాహోరీగా పోరాడినా, వివిధ వర్గాల ప్రజల సమస్యలపై ఉద్యమించినా.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బిజెపి పార్టీ మూడు సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉందని భావించినప్పటికీ ఫలితాలు తలకిందులు అయ్యాయి.
వ్యతిరేక ఓట్లను పొందడంలో ఫెయిల్..
రాష్ట్రవ్యాప్తంగా అధికార టిఆర్ఎస్ పార్టీకి ఏర్పడిన వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంలో బిజెపి ఫెయిల్ అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టిఆర్ఎస్ బిజెపి ఒకటేనంటూ కాంగ్రెస్ పార్టీ సాగించిన ప్రచారం ప్రభావం చూపిందని భావిస్తున్నారు. టిఆర్ఎస్ సర్కార్ అవినీతి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం, వివిధ దర్యాప్తు సంస్థలు తగిన చర్యలు తీసుకోలేదని పద్ధతుల్లో కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో డిఆర్ఎఫ్కు ప్రత్యామ్నాయం బిజెపి కాదంటూ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేసిందని చర్చ జోరుగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థిని నిలబెట్టకపోవడం కూడా ఒక కారణమని చర్చిస్తున్నారు.
రెండుచోట్ల డిపాజిట్లు గల్లంతు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాల్లో బిజెపి డిపాజిట్లను కోల్పోయింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి సంగప్పకు కేవలం 6,521 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అలాగే ఆందోల్ నియోజకవర్గం లో పోటీచేసిన బాబు మోహన్ కు 5,462 ఓట్లు మాత్రమే పోలై డిపాజిట్లు కోల్పోయారు. దుబ్బాక సిట్టింగ్ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు 43,744 ఓట్లు పోలై ఓటమి చెందారు. ఇక్కడ ఆయన రెండవ స్థానానికి పరిమితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ పై పోటీ చేసిన ఈటల రాజేందర్ గెలుపు ఖాయం అనుకున్నప్పటికీ 67,061 ఓట్లు పోలవగా రెండవ స్థానానికి పరిమితమయ్యారు.
ఈ రెండు నియోజకవర్గాలు మినహాయిస్తే నర్సాపూర్ లో మురళి యాదవ్ కు 22,713 ఓట్లతో మూడవ స్థానం పొందారు. మెదక్లో పంజా విజయ్ కుమార్ కు 13,657 ఓట్లు, జహీరాబాద్ లో రామచందర్ రాజనర్సింహకు 13,454 ఓట్లు, సంగారెడ్డిలో పులిమామిడి రాజుకు 20,509 ఓట్లు, పటాన్చెరులో నందీశ్వర్ గౌడ్ కు 19,963 ఓట్లు, సిద్దిపేటలో దూది శ్రీకాంత్ రెడ్డి కి 22,332 ఓట్లు పోలవగా మూడవ స్థానానికి పరిమితమయ్యారు.
మెదక్ లో సహకరించని స్థానిక నేతలు..
మెదక్ నియోజకవర్గంలో బిజెపి అనుకున్న స్థాయిలో ఓట్లను రాబట్టలేక పోయింది.
మెదక్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడినా తమకు ఓట్లను గణనీయంగా పెంచుకోగలిగింది. 2018 ఎన్నికల్లో మెదక్ బీజేపీ అభ్యర్థిగా ఆకుల రాజయ్యకు 6,321 (3.74శాతం) ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో మాత్రం ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. ఈసారి ఎన్నికల్లో బిజెపికి 13,657 (7.30 శాతం) ఓట్లు లభించాయి. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోలిస్తే కమలం పార్టీకి 7,336 (3.56శాతం) ఓట్లు పెరిగాయి. అయితే బిజెపి అభ్యర్థి బలమైన నేతగా లేకపోవడం.. నియోజకవర్గ నాయకులు అతనికి సహకరించకపోవడం వల్లే అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రచార కార్యక్రమంలో సైతం తూతూ మంత్రంగా నిర్వహించారు తప్ప ప్రభుత్వ వ్యతిరేక సాధించే దిశగా కృషి ఆరోపణలు మెండుగా ఉన్నాయి.
.