కూలిన శిక్షణ విమానం పైలట్, కో పైలట్ సజీవ దహనం

మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద ఘటన 

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి బ్రాహ్మణపల్లి - రావెల్లి సమీపంలోని గుట్టల్లో శిక్షణ విమానం కుప్పకూలింది. సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో భారీగా శబ్దం రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అది దుండిగల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ గా గుర్తించారు. మంటలు చెలరేగడంతో పైలెట్, ట్రైనీ పైలెట్ సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. సాంకేతిక లోపం కారణంగానే శిక్షణ విమానం కూలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విమాన ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ ప్రకటన

మెదక్ జిల్లా తూప్రాన్ లో శిక్షణ విమానం కూలడంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించింది. "హైదరాబాద్లోని ఏఎఫ్ఎ నుంచి సాధారణ శిక్షణా కార్యక్రమంలో సోమవారం ఉదయం "పీసీ 7 ఎంకే ॥" విమానం ప్రమాదానికి గురైంది. అందులోని ఇద్దరు పైలెట్లు చనిపోయినట్లు గుర్తించినట్లు ఐఏఎఫ్ ధ్రువీకరించింది. ఇతరుల ఆస్తి, ప్రాణాలకు నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించాం" అని ట్వీట్ లో పేర్కొంది.

.