తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ జిల్లా పాపన్నపేట శివారులోని బారాకనాల్ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టేక్మాల్ మండల పరిధి అసన్మహమద్ పల్లి గ్రామానికి చెందిన కున్సోత్ చిన్య(45), దేవ్య(42) ద్విచక్ర వాహనంపై పాపన్నపేట నుంచి మెదక్ వైపు ధాన్యం విత్తనాలు కొనేందుకు వెళ్తున్నారు. పాపన్నపేట శివారులోని బారాకనాల్(బ్రిడ్జ్) వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న లారీ వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఇరువురు అన్నదమ్ములు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలపై పడి రోదించడం తో అక్కడ ఉన్న ప్రయాణికులు కంటతడి పెట్టుకున్నారు. ఇద్దరి అన్నదమ్ముల మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పాపన్నపేట ఎస్సై మహిపాల్ రెడ్డి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ బ్రిడ్జిపై గతంలో కూడా ప్రమాదాలు చోటుచేసుకుని మృత్యువాత పడిన ఘటనలు కూడా ఉన్నాయి.
.