జిల్లా వ్యాప్తంగా 80.28 శాతం నమోదు
మెదక్ లో 81.72 %
నర్సాపూర్ లో 78.89 శాతం నమోదు
జిల్లాలో అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ జిల్లాలో సాధారణ ఎన్నికలు గురువారం నాడు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఉదయం 10 గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్ సాయంత్రం వరకు ఊపందుకుంది. తెలంగాణా రాష్ట్రంలోనే మెదక్ జిల్లాలో అత్యధికంగా 80.28 శాతం పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ సరళిని అధికారులు విడుదల చేశారు. మెదక్ నియోజకవర్గంలో 81.72 శాతం ఓట్లు పోల్ కాగా, నర్సాపూర్ నియోజకవర్గంలో 78.89 శాతం ఓట్లు పాలయ్యాయి. జిల్లాలో మొత్తం 4.40,341 లక్షల ఓటర్లు ఉండగా, 579 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. జిల్లాలో మొత్తం 24 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మెదక్ నియోజకవర్గంలో 216748 ఓటర్లు ఉండగా, 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయగా 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే నర్సాపూర్ నియోజకవర్గంలో 223593 ఓటర్లు ఉండగా, 305 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా 11 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. గురువారం జరిగిన పోలింగ్ లో మహిళలు, యువత, రైతులు, వృద్దులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణను పరిశీలించారు. వృద్ధుల కోసం వీల్ చైర్, నీటి వసతి వంటి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు, బీఎల్వోలు, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది తమ సేవలను నిర్వహించారు. రామాయంపేట మండలం కొనపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి, చిన్నశంకరంపేట మండలం కోర్విపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్, నిజాంపేట్ మండలంలో బిజేపి అభ్యర్థి పంజా విజయ్ కుమార్, హవేలిఘనపూర్ మండలం కుచన్ పల్లిలో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జిల్లాలో స్వల్ప ఘర్షణలు:
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లాలో అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ప్రాంగణం బయట బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల మధ్య కొద్దిపాటి ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి పరిస్థితిని అదుపుచేశారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు తన పై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ
మెదక్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మెదక్ పట్టణానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు తన వాహనాన్ని అడ్డుకొని దాడికి యత్నించి, భయబ్రాంతులకు గురి చేశారని ఆరోపిస్తూ మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి రోహిత్ సతీమణి శివానీ రెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కౌడిపల్లి, కొల్చారం, రామాయంపేట, పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపుచేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
.