జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధం

సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సోమవారం తెలిపారు. జిల్లాలో 910 లొకేషన్స్ లో మొత్తం 1609 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.

నవంబర్ 28 సాయంత్రం 5:00 గంటల నుండి   ప్రచార కార్యక్రమం నిషేధించామని, ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. 28 సాయంత్రం ఐదు గంటల నుండి జిల్లాయేతర వ్యక్తులు ఎవరూ జిల్లాలో ఉండకూడదని స్పష్టం చేశారు.

ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, ఎం సి సి , పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని,కళ్యాణ మండపాలు, హోటల్లు, లాడ్జింగ్లు తనిఖీ చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.

ఈనెల 28న సాయంత్రం ఐదు గంటల నుండి లౌడ్ స్పీకర్ల వినియోగం, సమావేశాలు నిషేధించినట్లు తెలిపారు. అభ్యర్థుల కు వాహనాల అనుమతులు నియమ నిబంధనల మేరకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం నుండి మాత్రమే జారీ చేయడం జరుగుతుందన్నారు.

ఈనెల 29, 30వ తేదీ సెలవు దినంగా ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

సెక్షన్ 126(1)(బి) ఆర్ పి యాక్ట్ 1951 ప్రకారం ఒపీనియన్ పోల్ మరియు ఎగ్జిట్ పోల్స్ నిషేధించినట్లు తెలిపారు.

ఈనెల 28 సాయంత్రం ఐదు గంటల నుండి ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో మద్యం షాపులు మూసివేస్తున్నట్లు, డ్రైడేగా ప్రకటించినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.5.24 కోట్ల నగదు జప్తు చేశామని, ఆదాయపన్ను శాఖ ద్వారా 19.48 కోట్ల రూపాయల నగదు జప్తు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 2,67,863.55 లీటర్ల లిక్కర్, 659.58 కిలోల అక్రమ గంజాయిని జప్తు చేశామని పేర్కొన్నారు.7.155 గ్రాముల బంగారం, 23,641 గ్రాముల వెండి, 1395 చీరలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

 జిల్లాలో సి విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 302 ఫిర్యాదులు రాగా, అన్ని ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రవర్తన నియమావళి ఉల్లంఘనల కింద 25 ఫిర్యాదులు రాగా 20 కేసులు నమోదు చేసినట్లు, 9 సోషల్ మీడియా ఫిర్యాదులు రాగా ఐదు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

జప్తు చేసిన నగదు నుండి జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా 3.40 కోట్ల రూపాయలు విడుదల చేశామని, జిల్లాలో ఇప్పటివరకు 6086 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

.