మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సాధారణ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
హవేలీ ఘనపూర్ మండలం, నాగపూర్ గ్రామం వీవోఏ యాదగిరి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆ గ్రామ ప్రతినిధులు జిల్లా జనరల్ పరిశీలకుడు పృథ్విరాజ్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారికి విచారణకు ఆదేశించారు. తప్పుడు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో గ్రామ మహిళ సంఘాలను మభ్య పెడుతూ సౌభాగ్య లక్ష్మి పథకం కింద 3వేల రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తాయని ప్రచారం చేశారని ఫిర్యాదు మేరకు విచారణ చేయగా ఆధారాలు చూపించిన నేపథ్యంలో విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. అలాగే పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలోని ప్రభుత్వ బిసి బాలుర వసతి గృహము వార్డెన్ మనోహర్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే చందాయిపేట వివో ఏ పద్మ సైతం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పనిచేసినందుకు సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ రాజర్షి తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ ప్రచారాలలో పాల్గొనకూడదని ఆదేశించారు. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహిస్తే సిసిఏ నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవలసి వస్తుందని అయన హెచ్చరించారు.
.