అవకాశం మీరివ్వండి.. అభివృద్ధి ఏమిటో నేను చూపిస్తా

మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు

మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో జోరుగా ప్రచారం

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం మీరు ఇస్తే..అభివృద్ధి ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తా అని మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ ఓటర్లను కోరారు. మెదక్ పట్టణంలోని ఐదవ వార్డుతో పాటు పలు వార్డుల్లో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే పద్మకు పదేళ్ల పాటు అవకాశం ఇస్తే మెదక్ అభివృద్ధినీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. మినీ ట్యాంక్ పేరు చెప్పి పదేళ్లుగా నిర్మాణం సాగిస్తున్నారని, కానీ ఇంకా పదేళ్లు పట్టే అవకాశం ఉందన్నారు. జిల్లా కేంద్రం, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు తెచ్చామని చెబుతున్నారే తప్ప, ఇతర అభివృద్ధి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే మెదక్కు వచ్చిన నిధులు అన్ని సిద్దిపేట తరలి పోతే ఇక్కడ ఎలా అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోతుంటే ప్రశ్నించనీ ఎమ్మెల్యే, మరో సారి అవకాశం ఇస్తే జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోయినా అడిగే వారే ఉండరన్నారు. మెదక్ పట్టణ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, చిన్న చిన్న పట్టణాలు అభివృద్ధి చేసుకుంటే మెదక్ మాత్రం ఏళ్లుగా అభివృద్ధి ఎందుకు నోచుకోవడం లేదో గుర్తించాలని కోరారు. ఈ సారి కాంగ్రెస్ను గెలిపిస్తే పదేళ్లు అభివృద్ధి లో ముందుకు తీసుకు వెళతానని అన్నారు. ప్రభుత్వం డబ్బులు ఇవ్వకున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా కోట్లు ఖర్చు చేసి పాఠశాలలు, గ్రామాల్లో బోర్లు వేసినా విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సురేందర్ గౌడ్, జీవన్ రావు, కౌన్సిలర్ రాజలింగం, శేఖర్, మాజీ కౌన్సిల్ అనిల్, సులోచన, విజయ లక్ష్మి, లాల్లుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

.