పాస్ పోర్ట్ బ్రోకర్ సీఎం కేసీఆర్

 నా కొడుకును విమర్శించే హక్కు ఆయనకెక్కడిది

రబ్బరు చెప్పుల హరీష్ కు కోట్ల డబ్బు ఎక్కడివి

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 

 14వ వార్డులో 500 మంది కాంగ్రెస్లో చేరిక

 తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): సీఎం కేసీఆర్ ఒకప్పుడు పాస్పోర్ట్ బ్రోకర్ అని, ఆయన గత చరిత్ర అంతా ప్రజలకు తెలుసని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్రంగా వ్యాఖ్యానించారు. 

రానున్న రోజుల్లో మంత్రి హరీష్ రావు,  కేటీఆర్ ల భాగవతం బయటపెడతానని తాను ఎవరికి భయపడేది లేదని,  ప్రజల అండ ఉన్నంతవరకు తన పోరాటం చేస్తానని హనుమంతరావు స్పష్టం చేశారు. గురువారం మెదక్ పట్టణంలోని 14వ వార్డు కౌన్సిలర్ దొంతి లక్ష్మీ ముత్యం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు.

 మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ...

తన కొడుకు మైనంపల్లి రోహిత్ డాక్టర్ విద్యను అభ్యసించి ప్రజలకు సేవ చేయడానికి వస్తే సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ అంటూ  వ్యాఖ్యానించడం సరి కాదన్నారు.

టిఆర్ఎస్ నాయకులు అభివృద్ధి చేశామని ఓటు వేయమని అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మెదక్ నియోజకవర్గంలో గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పితే కొత్తగా ఎమ్మెల్యే పద్మ చేసింది ఏమిటో ప్రజలకు వివరించాలని ఆయన ప్రశ్నించారు.

  బీఆర్ఎస్ నేతల పనితీరుపై విమర్శిస్తే గూండాలుగా, రౌడీలుగా చిత్రీకరిస్తారా అంటూ ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు వెళ్లడానికి సంవత్సరానికి 80 కోట్లు ఖర్చు చేస్తున్నాడని, 10 సంవత్సరాల కాలంలో 800 కోట్లు ప్రజల సొమ్మును కేవలం తన ఫామ్ హౌస్ కి వెళ్లడానికి ఖర్చు చేశారని ఆరోపించారు. అన్ని సబ్బండ వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని విమర్శించారు.

 రాష్ట్రంలో దళితులకు భూములు, పేద ప్రజలకు ఇండ్లు కేటాయించిన పాపాన పోలేదు కానీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటన్నారు.

మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

కాంగ్రెస్ పార్టీ ప్రచార కన్వీనర్ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా మాట్లాడుతూ..దోపిడీ దొంగల ముఠా పాలకుల నుండి మెదక్ నియోజకవర్గాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావును అధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు.

 పదేళ్లపాటు డిఆర్ఎస్ పార్టీకి అధికారమిచ్చి ప్రజలు మోసపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

 ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ దొంతి లక్ష్మీ ముత్యం గౌడ్ తో పాటు సుమారు 500 మంది మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, గంగా నరేందర్, గూడూరు కృష్ణ, కొండన్ సురేందర్ గౌడ్,  జీవన్ రావు, బొజ్జ పవన్,  ఉప్పల రాజేష్ పాల్గొన్నారు.

.