కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మొద్దు
కాంగ్రెస్, బిజెపికి ఓటు వేస్తే గోసపడతాం
నర్సాపూర్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ) కాంగ్రెస్ నాయకులు ధరణి తీసేస్తాం అని చెబుతున్నారు... మేం చెప్పంగ కూడా మాకు ప్రజలు ఓటేసిండ్రు. గ్యారెంటీగా తీసేస్తాం అంటరు. అప్పుడు కేసీఆర్ కూడా చేయగలిగేది ఏం ఉండదు. మీరు ఆలోచన చేయండి. ఇది చిన్నసన్న విషయం కాదు. అరిచేది కాదు. డెఫినెట్‌గా ఇది చాలా సీరియస్ మ్యాటర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వివరించారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పదేండ్ల నుంచి మేం కష్టపడి, మా తలకాయ పగులగొట్టుకొని, మూడు సంవత్సరాలు కష్టపడి ధరణి తెచ్చాం. రైతుల భూములు సేఫ్‌గా ఉండాలి.. ఈ జుట్లు ముడేసి పంచాయితీ పోవాలని ధరణికి రూపకల్పన చేశాం. లేకపోతే ఇవాళ భూముల ధరలు ఎంత పెరిగినయి తెలంగాణలో. ఇవాళ పెరిగిన ధరలకు ఎన్ని హత్యలు, కొట్లాటలు అయితుండే. ఎన్ని తలకాయలు పగిలిపోతుండే. ఎంత సీరియస్ మ్యాటర్ అయితుండే. ఈ విషయం మీరు ఆలోచించాలి. ఇవాళ మీరు దరఖాస్తు పెట్టకుండా, ఏ ఆఫీసు చుట్టు తిరగకుండా నేరుగా మీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. వడ్లు అమ్మితే కూడా నేరుగా మీ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. ఇంత మంచి సదుపాయం వస్తే, వాళ్లు ఉన్ననాడు చేయ చేతకాలేదు. వారికి తెలివిలేదు. ఇవాళ మేం చేస్తే దాన్ని తీసేస్తాం అంటున్నారు. కాంగ్రెస్ ఆలోచన సరళి ఈ విధంగా ఉంది. ఏది కావాల్నో మీరు నిర్ణయించాలి అని కేసీఆర్ ప్రజలకు సూచించారు.
అసైన్డ్ భూములపై కాంగ్రెస్ అసత్య ప్రచారాలు..
పరంపోగు, అసైన్డ్ భూములపై అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పటంలో పెద్ద మొనగాళ్లు.. ఈ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు.. ఇది పూర్తి తప్పుల తడక, అబద్ధం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పటంలో పెద్ద మొనగాళ్లు. పరంపోగు భూములు, ఎవరికైతే అసైన్‌మెంట్ ఇచ్చామో.. ఎస్సీలు కావొచ్చు, ఎస్టీలు కావొచ్చు, బీసీలు కావొచ్చు. వాటిని గుంజుకుంటున్నాం అని చెబుతున్నారు. ఎవరన్న గుంజుకుంటారా..? ఇంత అబద్ధాలు చెప్పొచ్చునా..? మొన్ననే ఎలక్షన్ల మేం చెప్పినం. మేనిఫెస్టోలో కూడా చెప్పినం. ఈ అసైన్‌మెంట్ ఇచ్చిన భూములకు వారికి అధికారం లేకుండా పోతుంది. మాముళ్లు వారు అయితే అమ్ముకుంటున్నరు.. కొనుక్కుంటున్నరు. వీళ్లకు కూడా కొంతకాలం దాటిన తర్వాత పట్టా ఇవ్వాలని చెప్పినం. దళిత, గిరిజన ఎమ్మెల్యేలు కూడా పట్టాలు ఇవ్వాలని కోరారు. డెఫినెట్‌గా అసైన్డ్ భూములకు పట్టా చేసి హక్కులు వారికే ఇస్తామని మనవి చేస్తున్నా. అవి భూములు ఎవరికి పోవు. ఈ అసత్య ప్రచారాలు నమ్మాల్సిన అవసరం లేదు. ఇది పూర్తి తప్పుల తడక అబద్ధం అని మనవి చేస్తున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఆ కాల్వ పూర్తయితే నర్సాపూర్ వజ్రపు తునకలా తయారవుతది...
ఒకప్పుడు నర్సాపూర్ నియోజకవర్గానికి మంచి నీళ్లు రాకపోయేది.. కానీ ఇప్పుడు కోమటిబండ నుంచి మంచినీళ్లు తీసుకొచ్చాం.. ఇప్పుడు మంచినీళ్ల బాధ లేదు.. ఇక పిల్లుట్ల కాలువ ద్వారా సాగునీరు తీసుకొస్తే, నర్సాపూర్ వజ్రపు తునకలా తయారవుతదని అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మంజీరా నది, హల్దీ నది ఎట్ల ఉండేది కాంగ్రెస్ రాజ్యంలో. ఎవరన్న పట్టించుకున్నడా..? ఇంకా వాళ్ల తెలివికి ఏం చేసిండ్రు అంటే ఈ రెండు నదుల మీ చెక్ డ్యాంలు కట్టొద్దని బ్యాన్ పెట్టిండ్రు. ఈ రోజు రెండు నదుల మీద చెక్ డ్యాంలు కడితే అవి ఇప్పుడు జీవనదుల్లా ఉంటున్నాయి. హల్దీ వాగుకు అయితే కాళేశ్వరం నీళ్లు పోసి ఎండకాలంలో మత్తళ్లు దుంకుతున్నాయి. బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి అని కేసీఆర్ తెలిపారు.
మంజీరా నది, హల్దీ నది ఎట్ల ఉండేది కాంగ్రెస్ రాజ్యంలో. ఎవరన్న పట్టించుకున్నడా..? ఇంకా వాళ్ల తెలివికి ఏం చేసిండ్రు అంటే ఈ రెండు నదుల మీ చెక్ డ్యాంలు కట్టొద్దని బ్యాన్ పెట్టిండ్రు. ఈ రోజు రెండు నదుల మీద చెక్ డ్యాంలు కడితే అవి ఇప్పుడు జీవనదుల్లా ఉంటున్నాయి. హల్దీ వాగుకు అయితే కాళేశ్వరం నీళ్లు పోసి ఎండకాలంలో మత్తళ్లు దుంకుతున్నాయి. బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి అని కేసీఆర్ తెలిపారు.
మదన్ రెడ్డి గౌరవప్రదమైన పదవిలో ఉంటారు..
మదన్ రెడ్డి ఖాళీగా ఉండడు. ఆయన సముచితమైన, గౌరవప్రదమైన పదవిలో ఉంటారు. ఆయన నాకు చిరకాల, పాత మిత్రుడు. ఇవాళ కొత్తగా కాదు. ఆయన ఎమ్మెల్యే కావడానికి నేను ఎన్నో బాధలు పడ్డాను. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. సునీతా లక్ష్మారెడ్డి, మదన్ రెడ్డి కలిసి నర్సాపూర్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తరు. సునీతా లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను అని పేర్కొంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ బిఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీలు వెంకటరామిరెడ్డి, రగోత్తమ్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
.