తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ గాలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తాడూరి ఎల్లయ్య, కిష్టమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. గత 12ఏళ్ల క్రితమే ఎల్లయ్య మృతి చెందగా అప్పటి నుంచి కిష్టమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవన సాగిస్తున్నారు. పెద్ద కుమారుడైన సుమన్ (21) కూలీ పనులు చేసుకుంటూ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కిష్టమ్మ డ్వాక్రా గ్రూపులో చిట్టి నగదు తీసుకుంది. దీంతో చిట్టి నగదు ఎందుకు తీసుకున్నావని సుమన్ తల్లి కిష్టమ్మతో గొడవ పడ్డాడు. దీంతో తల్లి భయపడి నార్సింగిలోని తన చెల్లి ఇంటికి వెళ్ళి పోయింది. ఈ క్రమంలో సుమన్ ఇంట్లోని ఓ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన బంధువులు గమనించి కిష్టమ్మకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి, తల్లి కిష్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
