వేములవాడ ఎమ్మేల్యే అభ్యర్ధి చల్మెడ లక్ష్మీనరసింహరావు
మల్కపేటలో భారీ ర్యాలీతో ఘన స్వాగతం
తెలంగాణ ప్రభ, (కోనరావుపేట) ; వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్మెడ లక్ష్మీనరసింహరావు ను ప్రకటించడంతో ఆయన స్వంత గ్రామం కోనరావుపేట మండలం మల్కపేటలో గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ తీసి ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో, ఒగ్గు కళాకారుల నృత్యాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ..... సీఎం కేసీఆర్ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారని నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించాలని... అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. స్వంత గ్రామంలో రూ.2కోట్లతో బడి, రూ.5కోట్లతో రామాలయాన్ని నిర్మించామని అన్నారు. ప్రజా క్షేత్రంలో ఉంటే ఇంకా మరింత అభివృద్ది చేస్తానన్నారు. పార్టీలో అందరం ఒకటేనని వర్గాలంటు ఏమీ లేవన్నారు.ఎమ్మేల్యే చెన్నమనేని రమేష్ బాబుతో కలిసి ముందుకు వెలతామన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినవి కాకుండా చెప్పనివి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారన్నారు. కేసీఆర్ ను మూడో సారి సీఎం గా చూడాలంటే ఆయన నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని జడ్పీ చైర్ పర్సన్ కోరారు. రాబోయే ఎన్నికల్లో చల్మెడ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులతో చల్మెడ, జడ్పీ చైర్ పర్సన్ లు ఒగ్గు డోలును వాయించడం ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మెన్ చల్మెడ రాజేశ్వర్ రావు,ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్,సర్పంచ్ ఆరె లత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య,ఆయా గ్రామాల సర్పంచులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
