తెలంగాణప్రభ,(కోనరావుపేట); అష్ట కష్టాలు పడి ధాన్యం అమ్ముకున్న రైతుల ఖాతాల్లో వెంటనే ధాన్యం డబ్బులు వేయాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ.... ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కోనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు పడి అమ్ముకొని నెలలు గడుస్తున్నా ధాన్యం డబ్బులు ఖాతాల్లో వేయకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను తీవ్ర అవస్ధలకు గురి చేస్తున్నారన్నారు. రైతు సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు.దళారులను నమ్మొద్దు అంటూ ప్రభుత్వం మిల్లర్ల తో కుమ్మక్కై రైతులను దోచుకున్నారన్నారు. వెంటనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు వెంగలి వెంకటేశ్వర్లు, ఆతికం శ్రీనివాస్ ,తాలపెల్లి పర్శరాములు, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు మహేందర్, తీగల వెంకటి, వెంగలి తిరుపతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
