. వివాహం చేసుకున్న జంటలకు ఆర్థిక తోడ్పాటుతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలైన దళిత బంధు, డబుల్ బెడ్ రూం, మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చి ఉద్యోగాలలో రిజర్వేషన్ అమలు చేయాలి.
. అర్ధిక ప్రోత్సాహాన్ని 2.50 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలి.
. మూడేళ్ళ వ్యవధి కాకుండా ఏడాది లోపే వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలి.
తెలంగాణ ప్రభ, (పెద్దపల్లి): కుల రహిత సమాజ స్థాపనకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరింతగా కృషి చేయాలని, దేశంలోనే తొలిసారిగా డాక్టర్ బి.ఆర్ అంబెద్కర్ పేరిట సచివాలయం ఏర్పాటు చేయడం శుభపరిణామమని, సచివాలయం ముందు బాబా సాహెబ్ అంబేద్కర్ అతి పెద్ద విగ్రహన్ని జ్ఞాన విగ్రహంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టించడం అభినందనీయం అని అదే విధంగా కులాంతర వివాహాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని, వారికి అన్ని విధాలా రక్షణ తో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయాలని సిపిఐ రామగుండం నగర సహయ కార్యదర్శి మద్దెల దినేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒక ప్రకటనలో కోరారు.
కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ కొన్నేండ్లుగా ఎంతో కొంత నగదు ప్రోత్సాహకం అందిస్తున్నప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో రూ.50వేలుగా ఉన్న సాయాన్ని సీఎం కేసీఆర్ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన అనంతరం రూ.2.50లక్షలకు పెంచి కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నప్పటికిని, కాలయాపన జర్గుతున్నదని, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం కోసం ఎస్సీ అభివృద్ధి శాఖకు దరఖాస్తు చేసుకోగా లబ్ది దారులు కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి నీరసించిపోతున్నారే తప్ప వివాహం చేసుకున్న జంటలకు న్యాయం జరగడం లేదని, దీని పేరుతో మద్యలో దళారులు బ్రతుకుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూ వివాహ చట్టం 1955 కింద తమ వివాహాన్ని నమోదు చేసుకుని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నప్పటికిని, ప్రోత్సాహం కింద లబ్ధి దారులకు ఇస్తున్న
రెండున్నర లక్షలు తమ ఖాతాలో జమ కావడానికి దాదాపు మూడు ఏళ్ల సమయం పడుతుందని, అలా కాకుండా ఏడాది లోపే వారి జాయింట్ ఖాతాలో జమ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
కులాంతర వివాహాలు చేసుకున్న జంటల పై అనేక ప్రాంతాలలో దాడులు చేస్తున్నవి పత్రికలలో, టివి లలో చూస్తున్నామని, కనుక కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం, భద్రత అండగా ఉండి వారి పై దాడులు చేస్తున్న వారి పై ప్రభుత్వం నూతన చట్టం తీసుకురావాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేరళ రాష్ట్రంలో కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రాణహాని లేకుండా నిర్మించి ఇస్తున్న సేఫ్ హోమ్స్ లో ఏడాది ఉండచ్చు కేరళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుంది ఆల తెలంగాణ ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలని పేర్కొన్నారు.
అదే విధంగా తెలంగాణా రాష్ట్రంలో కులాంతర వివాహలు చేసుకున్న జంటల్లో ఎవరో ఒకరు దళితులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వారికి భద్రత కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారికి ఎలాంటి షరతులు లేకుండా దళిత బంధు పథకం వర్తింపజేయాలని, డబుల్ బెడ్ రూం కేటాయించాలని, మరియు మూడు ఎకరాలు ప్రభుత్వ భూమి ఇవ్వాలని, ఉద్యోగాలలో రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదే విధంగా 2.50 లక్షల నుండి 5లక్షల వరకు వివాహ ప్రోత్సాహాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ప్రభుత్వం ప్రోత్సహన్ని మూడేండ్ల కాకుండా ఏడాది తర్వాత వివాహం చేసుకున్న జంటల పేరిట ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లను కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు డ్రా చేసుకొనే విధంగా చూసి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సాహకం అందించాలని ఆయన అన్నారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా చేసిన రూ.2.50 లక్షలు మూడేండ్ల తర్వాత కులాంతర వివాహం చేసుకున్న జంటకు రూ. మూడు లక్షల వరకు అందుతుందనీ, ఎస్సీ అమ్మాయి లేదా ఎస్సీ అబ్బాయి ఇతర బీసీ, ఓసీ, ఎస్టీ వారిని వివాహం చేసుకుంటే కులాంతర వివాహం కింద ప్రభుత్వం ఈ ప్రోత్సాహాకాన్ని అందిస్తుందనీ, రూ.2.50లక్షలను నుండి 5 లక్షల వరకు ప్రోత్సాహాన్ని పెంచి కులాంతర వివాహం చేసుకున్న డబ్బులను ఏడాదిలోపే అందిస్తే తద్వారా వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం, స్వయం ఉపాధి రంగాన్ని ఎంచుకుని ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
మానవహక్కుల ఆర్టికల్ (16) ప్రకారం యుక్త వయసు వచ్చిన స్త్రీ పురుషులు మతం జాతి, జాతీయత పరిమితులు అతీతంగా పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనే హక్కు ఉందని ఆర్టికల్ పేర్కొంటుందని,సబ్-క్లాజ్ (2)ప్రకారం వధూవరులు వారికి ఇష్టపూర్వకంగా వారికి నచ్చిన వారు స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చు క్లాజ్ లో పేర్కొంటూ, కులము మతము, జాతి విధించిన కట్టుబాట్లను అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటన గుర్తించడం లేదని, కేవలం యువతి యువకులు వారికి నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు కల్పించిందని ఆయన అన్నారు.
కులాంతర వివాహాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వివాహాలు చేసుకున్న జంటల పై దాడులు చేస్తున్నవారిని కఠినంగా శిక్షించే చట్టాన్ని అమలు చేయాలని, అలాగే ప్రభుత్వ పథకాలు వారికి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు
.