నిర్మాణ పనులకు ఇసుక కొరత ఉండొద్దు:జిల్లా కలెక్టర్

తెలంగాణ ప్రభ( సిరిసిల్ల): జిల్లాలో ప్రభుత్వ పరంగా చేపడుతున్న నిర్మాణాలు, ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక కు కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు.

వేములవాడ చెక్ డ్యాం ముంపు ప్రాంతం నుండి స్థానిక అవసరాల కోసం ఎలాంటి యంత్రాలు వాడకుండా ఇసుక తీసేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గల

జిల్లా స్థాయి కమిటీ అనుమతించింది. 

అలాగే సముద్రలింగపూర్ - మల్లుపేట మధ్యగల లోతు వాగుపై వేసిన ఇసుక మేటల వల్ల బ్రిడ్జికి ప్రమాదం వాటిలే అవకాశం ఉండడం, పంట పొలాలు ముంపునకు గురవుతున్న దృష్ట్యా ఇసుక మేటలను తొలగించేందుకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...

జిల్లాలో ఇసుక కొరత వల్ల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రభుత్వ పరమైన నిర్మాణాలు ఆలస్యం కావొద్దు అన్నారు. ఎక్కడైనా ఇసుక సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఆర్డీవోలు ఆ విషయంపై సమీక్షించి ఇసుక సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ లు టి శ్రీనివాస్ రావు, పవన్ కుమార్,  గనుల శాఖ ఏడీ సైదులు, జిల్లా భూగర్భజల అధికారి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

.