
ఓసీ వర్గం నుంచే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు
నీలం మధు ఆశలు నెరవేరేనా
జహీరాబాద్లో గాలి వైపు బీఆర్ఎస్ చూపు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటి వరకు అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించక పోవడంతో ఆశావాహులు ఉత్కంఠకు గురతువున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్లను ప్రకటించడం జరిగింది. ఇటు మెదక్, జహీరాబాద్ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించడంలో అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి టికెట్ కేటాయిస్తామని స్వయంగా కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోవడంతో సమీకరణాలు తల్లకిందులయ్యాయి. దీంతో మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ నుండి మెదక్ లోక్‌సభ అభ్యర్థిని ఎంపిక చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వంటేరు ప్రతాప్‌రెడ్డి పేరు దాదాపుగా ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం ప్రతిపక్ష అభ్యర్థిని బట్టి తమ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధానంగా బీసీ వర్గానికి చెందిన నీలం మధు, ఓసీ విభాగానికి చెందిన మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ నుండి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, గురువారెడ్డి, బీఆర్ఎస్‌కు చెందిన చేవెళ్ళ ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మెదక్ సీటు తనకు కేటాయిస్తే బీజేపీలో చేరేందుకు ఆయన సిద్దంగా ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. మొత్తంగా మెదక్ లోక్‌సభ స్థానానికి ప్రధాన పార్టీలలో ఓసీ కేటగిరికి చెందిన అభ్యర్థులే ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌కు బీసీ మంత్రం ఫలిస్తుందా...?
మెదక్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున హేమాహేమీలు టికెట్టు ఆశిస్తుండగా...ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ముదిరాజ్ వర్గానికి చెందిన నీలం మధు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. నీలం మధు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ రాక భంగపడ్డారు. దీంతో బీఎస్పీలో చేరి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో కొందరు పెద్దల ఆశీస్సులతో తిరిగి పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు న్యాయం చేస్తుందని, ప్రధాన పార్టీలు బీసీ అభ్యర్థికి కేటాయించే అవకాశం లేనందున తనకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. మెదక్ లోక్‌సభ స్థానంలో ఏడు అసెంబ్లీ సీట్లకు గాను మెదక్ మినహాయిస్తే మిగతా ఆరింట బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. అందులో ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు ప్రాతినిద్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండడం గమనార్హం. ఈ తరుణంలో మెదక్ లోక్‌సభ స్థానంలో బీసీ మంత్రం ఫలిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా మెదక్ స్థానంలో మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 1998 ఎన్నికల తర్వాత ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందలేదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిద్యం వహించిన ఈ స్థానంలో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ పావులు కదుపుతుంది. ఈ తరుణంలో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాతనే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్ నేతలైన మైనంపల్లి హన్మంతరావు, జగ్గారెడ్డిలు సైతం తీవ్రంగా కృషి చేస్తున్నారు.
జహీరాబాద్ అభ్యర్థిపై బీఆర్ఎస్ మల్లగుల్లాలు...
ఇప్పటికే జహీరాబాద్ స్థానానికి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంలో సందిగ్ధం నెలకొంది. ఇక్కడ మున్నూరు కాపు వర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించాలని మున్నూరు కాపు వర్గానికి చెందిన కొందరు మాజీ మంత్రి హరీష్‌రావును కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ స్థానం నుండి ఇదే వర్గానికి చెందిన గాలి అనిల్‌కుమార్ పేరు వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్‌లో చేరిన గాలి అనికుమార్ మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. కానీ రాజకీయ సమీకరణాల వల్ల టికెట్ రానిపక్షంలో జహీరాబాద్ టికెట్‌ను కేటాయించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇరువురు కూడా లింగాయత్ వర్గానికి చెందిన వారు కావడంతో ఈసారి మున్నూరుకాపు వర్గానికి చెందిన అభ్యర్థిని బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని కోరడంతో గాలి అనిల్‌కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది.
