ప్రతి కార్మికుడికి 50 రకాలకు పైగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య కార్డు అందిస్తాం
మే రెండవ వారంలో ఎఫ్.ఎస్.టి.పి ప్రారంభోత్సవానికి సన్నద్ధం చేయాలి
రామగుండంలో ఎఫ్.ఎస్.టి.పి నిర్మాణ పనులు, కార్మికుల హెల్త్ క్యాంపును పరిశీలించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్
తెలంగాణ ప్రభ,(పెద్దపల్లి): నిర్మాణ రంగ కార్మికులందరికీ సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అన్నారు.
శుక్రవారం రామగుండంలోని గంగానగర్ న్యాక్ భవనంలో ఏర్పాటు చేసిన నిర్మాణ రంగ కార్మికుల వైద్య శిబిరాన్ని, ఎఫ్.ఎస్.టి. పి. ప్లాంట్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, నిర్మాణ రంగ కార్మికులందరికీ సంపూర్ణ ఆరోగ్య సంక్షేమం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహణ కార్యక్రమం చేపట్టామని జిల్లా కలెక్టర్ అన్నారు.
నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వం ఆధునిక ఆరోగ్య పరీక్షలు బిపి, షుగర్, చెవి, కంటి పరీక్ష, ఊపిరితిత్తుల పనితనం పరీక్ష, రక్త, మల, మూత్ర పరీక్షలు,గుండె పనీ తీరు పరీక్షలు, చర్మ సంబంధిత పరీక్షలు మొదలగు 50 కి పైగా ఆరోగ్య పరీక్షలను అనుభవజ్ఞులైన డాక్టర్ల నుంచి మార్గదర్శనం అందిస్తూ పూర్తి ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని, కార్మికులు తమ ఆధార్ కార్డు, నిర్మాణరంగ కార్మికుల గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
నిర్మాణరంగ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత బార్ కోడ్ తో ఆరోగ్య కార్డు అందిస్తామని, అందులో కార్మికుడి వైద్య పరీక్షల ఫలితాలు ఉంటాయని, భవిష్యత్తులో సైతం ఉపయోగపడుతుందని, ఆరోగ్య పరీక్షల నిర్వహణ తర్వాత అవసరమైన కార్మికులకు చికిత్స అందించడం కోసం ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
రామగుండం వైద్య క్యాంపులో ఇప్పటివరకు 350 పైగా కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించామని, మరో వారం రోజులపాటు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగు తుందని, మే నెలలో పెద్దపల్లిలో వైద్య క్యాంపు ప్రారంభిస్తామని, జిల్లాలో ఉన్న ప్రతి మండల కేంద్రంలో క్యాంప్ ప్రారంభించి కార్మికులందరికీ పకడ్బందీగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
అనంతరం గంగానగర్ లో నిర్మాణం లో ఉన్న ఎఫ్.ఎస్.టి.పి (Faecal Sludge Treatment Plant) మానవ వ్యర్థాల శుద్ధీకరణ చేయు ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ చివరి దశలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. మే రెండో వారంలో ప్రారంభోత్సవం నిర్వహించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట రామగుండం మున్సిపల్ కమిషనర్ బి. సుమన్ రావు, గోదావరిఖని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎం. శ్రీకాంత్, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
