విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయుడు
అడ్డుపడ్డ మరో ఉపాధ్యాయునిపై దాడి చేసిన బంధువులు
తెలంగాణ ప్రభ ( సిద్దిపేట ):విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కీచకుడిగా మారి ఇబ్బందులకు గురిచేసిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలాఉన్నాయి.. సిద్దిపేట జిల్లా నంగునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ ను బోధిస్తున్న తిరుపతి అనే ఉపాధ్యాయుడు ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినితో గత కొన్ని రోజుల నుంచి అసభ్యంగా ప్రవర్తిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత శనివారం ల్యాబ్ రూమ్ కు రమ్మని అసభ్యంగా ప్రవర్తించాడని, విషయాన్ని క్లాస్ టీచర్ తో పాటు విద్యార్థిని తన కుటింబీకులకు తెలపగా సోమవారం ఉదయం గ్రామస్తులతో కలిసి పాఠశాలకు వెళ్లారు. ఈ క్రమంలో పాఠశాలలో జరిగిన విషయంపై ఉపాధ్యాయులతో మాట్లాడుతుండగా బాలికకు సంబంధించిన బంధువులు సిద్దిపేట నుండి నంగునూరు పాఠశాలకు చేరుకొని ఇబ్బందులకు గురి చేసిన ఉపాధ్యాయని గురించి ఆరాధిస్తుండగా ఎదురుగా ఉన్న క్లాస్ టీచర్ అడ్డు రావడంతో అతనిపై దాడి చేశారు. అప్పటికే వేరే క్లాసు లో ఉన్న తిరుపతిని స్థానిక ఉపాధ్యాయులు తప్పించినట్లు సమాచారం. అక్కడే ఉన్న గ్రామస్తులు దాడిని అడ్డుకొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విషయం తెలుసుకున్న రాజగోపాల్ పేట పోలీసులు అక్కడకు చేరుకొని ఇరు వర్గాలకు నచ్చ చెప్పడంతో సమస్య సద్దుమనిగింది. అనంతరం గ్రామస్తులు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించి, కఠిన చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని డిమాండ్ చేశారు. కాగా స్థానిక నాయకులు జోక్యం చేసుకొని సదరు ఉపాద్యాయుడు సారి చెప్పగా ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరించినట్లు సమాచారం.
