అవిశ్వాసం ప్రవేశపెట్టకముందే స్వచ్ఛంద విరమణ
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ పదవికి మురళీ యాదవ్ రాజీనామా చేశారు. ఇటీవల నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలోనే గురువారం ఆయన ముందస్తుగా తన పదవికి రాజీనామా చేశారు. మురళి యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో అవిశ్వాస తీర్మానం అమలు చేయలేదు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే కంటే ముందే మురళి యాదవ్ రాజీనామా చేయడం గమనార్హం. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేయలేదన్నారు. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. గతంలో నర్సాపూర్ చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చలేదని, ఇప్పటివరకు అధికారిక భవనాలు పూర్తి కాలేదని అన్నారు. నాటి ముఖ్యమంత్రి నర్సాపూర్ వచ్చినప్పుడు మంజూరు చేసిన నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదని వివరించారు.
