మాది పేదల ప్రభుత్వం...అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు

మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు 

లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మాది పేదల ప్రజా ప్రభుత్వమని, సంపదనంతా ప్రజలకు అంకితం చేస్తామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్  రోహిత్ రావు అన్నారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ టౌన్, మెదక్ మండలం, హవేలీ ఘనపూర్ మండలాలకు చెందిన కళ్యాణలక్ష్మీ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం స్థాపించడమే ప్రజా పాలన లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ పాలనలో దశాబ్ద కాలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పేదలు కండ్లు కాయలు కాచేలా ఎదురు చూశారన్నారు. పదేండ్లలో ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదని విమర్శించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి తమ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమమే ప్రజాపాలన అని తెలిపారు. అర్హులైన పేదలందరికి ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజకీయ వివక్ష ప్రదర్శించబోమన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదు ..చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జీవన్ రావ్, బొజ్జ పవన్, హఫీజ్, మంగ మోహన్ గౌడ్, హరిత నర్సింగ్ రావ్, మ్యాకల రవి, రాజేందర్ రెడ్డి, మాణిక్యం, లక్కర్ శ్రీను, యామిరెడ్డి, శ్రీకాంత్,  హమీద్, పరుశురాం, తహశీల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, లింగం, బొద్దుల కృష్ణ, వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

.