అయోమయంలో ఆశావాహులు...
ప్రత్యేక అధికారుల పాలన తప్పదా?
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలకు 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గం పదవీకాలం 2024 జనవరి 31న ముగుస్తుంది. 2024 ఫిబ్రవరి నుండి నూతన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కావలసి ఉంటుంది. 2018 లో పాలకవర్గం రిజర్వేషన్ 5 సంవత్సరాలకు ఒక కాలపరిమితి, మరొక 5 సంవత్సరాలకు రెండు పర్యాయములు సర్పంచులు, వార్డు సభ్యులు 10 సంవత్సరాల కాలానికి ఓకే రిజర్వేషన్ కొనసాగుతుందని చట్టం చేయడం జరిగింది. ఈ విధానం రూపొందించిన బిఆర్ఎస్ ప్రభుత్వం మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుంది. గత ప్రభుత్వం రూపొందించిన పది సంవత్సరాల కాలపరిమితి, రెండు పర్యాయాల రిజర్వేషన్ మారుస్తుందా...? లేదా అనేది రాజకీయ నాయకుల మదిలో మెదులుతున్న ప్రశ్న. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న ఆశావాహులు ఆశతో రిజర్వేషన్ మారుతుందా...? లేదా అని సందిగ్ధంలో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్ ఆశావాహులు అవకాశం కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వద్ద 224 నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి గవర్నర్ సంతకం కోసం ఫైల్ పెండింగ్లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ సమయం వరకు నూతన 224 గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించిన పెండింగ్ ఫైల్ పై సంతకం పెడితే మొత్తం 12,769 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ గవర్నర్ సంతకం కానీ 224 నూతన గ్రామ పంచాయతీలో ఏర్పాటు గురించిన అంశం పెండింగ్లో ఉంటే పాత గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 2024వ సంవత్సరం ఎన్నికల సంవత్సరంగా మారుతుంది. 2024లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్తు ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపిక తర్వాత శాసనమండలి సభ్యుల ఎన్నిక, పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.
ప్రత్యేకాధికారుల పాలన తప్పదా?
పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 45 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ప్రత్యేకాధికారుల పాలన తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రక్రియకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని, పాలక వర్గాల కాలం ముగిసిన తరువాత ఎన్నికలు నిర్వహించేంత వరకు పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 224 పంచాయతీల ఏర్పాటు అంశం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. గవర్నర్ ఆమోదించకుంటే అసెంబ్లీలో మళ్లీ బిల్లును పెట్టి ఆమోదం తీసుకోవాలి. నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించకుంటే ప్రత్యేకాధికారులను, లేదా పర్సన్ ఇన్‌చార్జిలతో కాలం వెళ్లదీస్తారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా, లేక తరువాతా? అనేది ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
