ఐదు నియోజకవర్గాల్లో 13,93,711 మంది ఓటర్లు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సంగారెడ్డి జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు గాను పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 13,93,711 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని అంబేద్కర్ క్రీడా మైదానం నుంచి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1609 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించారు. పోలింగ్ కోసం 7068 మంది సిబ్బందిని నియమించగా వారందరూ ఈవీఎంలను తీసుకుని వారికి కేటాయించిన ప్రాంతాలకు తరలివెళ్లారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో 296 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 2,31,188 ఓటర్లు ఉన్నారు. అందోల్ నియోజకవర్గంలో 313 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గంలో 2,49,248 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 2,70,785 మంది ఓటర్లు ఉండగా 314 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 2,45, 253 మంది ఓటర్లు ఉండగా 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పటాన్ చెరు నియోజకవర్గంలో 3,97,237 మంది ఓటర్లు ఉండగా 405 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 70 మోడల్ పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
నారాయణఖేడ్ మోడల్ 8, వికలాంగులకు 1, యువకులకు 1, మహిళలకు ప్రత్యేకంగా 15 కేంద్రాల ఏర్పాటు చేశారు. ఆందోల్ నియోజకవర్గంలో మోడల్ 9, వికలాంగులకు 1, యూత్ 1, మహిళలకు 5 మొత్తం 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జహీరాబాద్ లో మోడల్ 5, వికలాంగులకు 1, యూత్ 1, మహిళలకు 5 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో మోడల్ 5, వికలాంగులకు 1, యూత్ 1, మహిళలకు 5 మొత్తం 12 కేంద్రాలు, పటాన్ చెరులో మోడల్ 8, వికలాంగులకు 1, యూత్ 1, మహిళలకు 5 మొత్తం 15 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 70 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 1609 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను అధికారులు తరలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి సీఐ స్థాయి అధికారిని నియమించారు. అదే విధంగా 389 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. 1089 పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు.
కేంద్రాలకు తరలి వెళ్లిన పోలింగ్ సిబ్బంది
689 పోలింగ్ కేంద్రాలను సీసీ కెమెరాల ద్వార పర్యవేక్షిస్తారు. 352 పోలింగ్ కేంద్రాలను వీడియో కవరేజ్ ద్వారా పర్యవేక్షిస్తారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
.