మేమంటే భయంతోనే సీఎం మెదక్ కు రెండుసార్లు వచ్చారు
దత్తత గ్రామాల్లో సైతం అభివృద్ధి శూన్యం
చివరికి డప్పుల్లో కూడా కమీషన్లులే
పద్మను ఇంటికి పంపాలి..
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు..
చేతి గుర్తుకే ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): కేసీఆర్ ప్రభుత్వం మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారా..? కేసీఆర్ కుటుంబానికే నాలుగు ఉద్యోగాలు వచ్చాయి కదా.. పదేళ్ల పాటు బీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి చేశారు.. ఈ సారి మార్పు కావాలి.. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మెదక్ మండల పరిధిలోని పాతూర్, తండాలు, తిమ్మనగర్, రాయిన్ పల్లి, మల్కాపూర్ తండా, మక్తభూపతి పూర్ తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మండలంలోని పలు గ్రామాలను దత్తత తీసుకుందని, ఆమె దత్తత తీసుకున్న గ్రామాల్లో సైతం అభివృద్ధి శూన్యమని మైనంపల్లి రోహిత్ ఆరోపించారు. చివరికి డప్పుల్లో సైతం కమీషన్లు తీసుకున్నారని, ఎన్నడూ మెదక్ రాని సీఎం కేసీఆర్.., మేమంటే భయం వేసే రెండుసార్లు మెదక్ వచ్చాడని రోహిత్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలన మొత్తం కమీషన్ల పాలనే సాగిందని, ప్రజల దోచుకొని దాచుకొని బొర్రలు పెంచారని మండిపడ్డారు. మన ఎమ్మెల్యే పద్మా రెడ్డి భర్త దేవేందర్ రెడ్డి ఏడుపాయల అమ్మవారి సొమ్మును సైతం వదల్లేదని ఆరోపించారు. పక్కనున్న సిద్దిపేట ఎలా ఉంది.. మన మెదక్ ఎలా ఉందో ప్రజలు ఒకసారి ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ గెలుపు ఎంతో దూరంలో లేదని ఇక పద్మ ఇంటిబాట పట్టక తప్పదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎకరాకు రైతుబంధు రూ. 15 వేలు అందించడమే కాకుండా ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శంకర్, ఉపాధ్యక్షులు గట్టాగౌడ్, ఎంపీటీసీలు శ్రీహరి, ప్రభాకర్, సిద్దాగౌడ్ యూత్ అధ్యక్షుడు రాజు, బీసీ సెల్ అధ్యక్షుడు మురళీ, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు హాఫీజ్ మోల్సాబ్, నాయకులు నాగరాజు, తుల్యా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
