తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశాల మేరకు జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ఫోర్స్ టీమ్స్ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఈ దాడులలో భాగంగా కిష్టారెడ్డి పేట గ్రామానికి చెందిన మన్నే రాజు అనే వ్యక్తి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తన కిరాణం షాపులో అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి యం.సి.-17 (180 ml), ఆఫీసర్ చాయిస్ -10 (180 ml), డైమండ్ ఫైన్ విస్కీ -50 (180 ml), ఆఫీసర్ చాయిస్ -25 (90ml) మొత్తం 16.11 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనపరుచుకొని, నిందితునితో సహ స్వాధీనపరుచుకున్న సొత్తును విచారణ నిమిత్తం అమీన్ పూర్ పోలీసు స్టేషన్ కు తరలించిన్నట్లు తెలిపారు. అలాగే ఘనపూర్ గ్రామానికి చెందిన వడోక్ వెంకటేష్ తన కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్నాడనే సమాచారంతో తనిఖీ చేయగా దక్కన్ -14 (180 ml), ఆఫీసర్ చాయిస్ -09 (180 ml), ఐ.బి.-05 (180 ml) మొత్తం 5.040 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనపరుచుకొని, నిందితునితో సహ స్వాధీనపరుచుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం బి.డి.యల్. భానూర్ పోలీసు స్టేషన్ కు తరలించిన్నట్లు తెలిపారు.
పోతిరెడ్డిపల్లి ఆర్.టీ.సి. కాలనీకి చెందిన పట్లోళ్ళ గోవర్ధన్ రెడ్డి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తన కారు నెంబర్ TS 15 EW 4747 గల దానిలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఐ.బి.-96 (180 ml) మొత్తం 17.280 లీటర్ల అక్రమ మద్యాన్ని, కారును స్వాధీనపరుచుకొని విచారణ నిమిత్తం సంగారెడ్డి టౌన్ పోలీసు స్టేషన్ కు తరలించిన్నట్లు పోలీసులు తెలిపారు.
.