తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల): సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ దాడుల్లో జిల్లా పరిశ్రమల కేంద్రంలో 13 వేలు లంచం తీసుకుంటూ జిల్లా అధికారి ఉపేందర్ రావు పట్టుబడ్డారు. లంచం తీసుకుంటూ అధికారి చిక్కడం జిల్లాలో సంచలన అంశంగా మారింది. వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామానికి చెందిన భూక్య సరిత వాహన సబ్సిడీ కోసం కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ కు దరఖాస్తు చేసుకుంది. సబ్సిడీ అప్లికేషన్ సరితకు అనుకూలంగా పంపడానికి 30 వేల లంచం సదరు అధికారి అడగగా 17వేలు ఈనెల 26న తీసుకోగా, సోమవారం మిగతా 13000 సరిత మరిది భూక్య శివకుమార్ జడ్పీ హైస్కూల్ గీత నగర్ లో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితున్ని ఏసిబి కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డిఎస్పి వివి రమణమూర్తి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లంచగొండితనం లేకుండా పారదర్శకంగా పనిచేయాలని ఆదేశాలిస్తే అధికారులు మాత్రం అవినీతికి పాల్పడి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు.
